English shape=
      

వారపు సందేశం - Word For The Week

"వారపు సందేశం" అనునది ప్రతివారము ప్రచురింపబడే వార్తా సందేశము. ఇందులో ప్రతి అంశము జాక్ పూనన్ గారి యొక్క ఉపదేశములు, పుస్తకాలు లేదా ప్రసంగముల నుండి స్వీకరించబడును.
2011 |  2012 |  2013
విశాల హృదయము కలిగి యుండుటకు కోరుకొనుము.
జులై 2012 (3) - జాక్ పూనన్

1 రాజులు 3:16-28 లో సొలొమోను జ్ఞానమును గూర్చి ఒక ఉదాహరణ చూచెదము. ఒకరోజు ఇద్దరు వేశ్యలైన స్త్రీలు తీర్పుకొరకు ఆయన యెదుట నిలిచిరి. వారిద్దరు ఒకే ఇంటిలో నివసించుచుచుండిరి మరియు కొద్ది రోజుల తేడాతో ఇద్దరు బిడ్డలను కనిరి. ఒకరాత్రియందు ఒకతె తన పిల్లమీదపడగా అది చచ్చెను. జరిగినది తెలుసుకొనినవెంటనే తనబిడ్డకు బదులుగా బ్రతికిన బిడ్డను తనకౌగిటిలో పెట్టుకొనెను. ఉదయకాలమున మరొక స్త్రీ జరిగినది తెలుసుకొని, బ్రతికున్న తన బిడ్డను తనకిమ్మని అడిగెను. అప్పుడు బ్రతికున్న బిడ్డ ఎవరి బిడ్డ అనే వివాదము కలిగెను. ఈ పరిస్థితిలో సొలొమోను ఏవిధముగా నిర్ణయము తీసుకొనబోవుచున్నాడు ? సొలొమోనుకు దేవుడు జ్ఞానమును అనుగ్రహించెను. బ్రతికున్న బిడ్డను రెండు భాగములుగా నరికి, చెరిసగము తీసుకొనమని సొలొమోను సలహాచెప్పెను. ఆబిడ్డకు నిజమైన తల్లియైన మొదటి స్త్రీ “బిడ్డను చంపవద్దు, రెండవ స్త్రీకి ఇవ్వమని” చెప్పెను. కాని రెండవ స్త్రీ “ఆ బిడ్డను చంపి, చెరిసగము తీసుకొనెదమని” చెప్పెను. వెంటనే ఆ బిడ్డకు నిజమైన తల్లి ఎవరనేది అందరికి తెలిసెను. “మొదటి స్త్రీకి బిడ్డను ఇమ్మనమని” సొలొమోను చెప్పెను. ఇశ్రాయేలీయులందరు ఆతీర్పును విని మరియు దేవుడు రాజుకిచ్చిన జ్ఞానమును చూచి ఆయనకు భయపడిరి.

ఈనాడు సొలొమోను జ్ఞానమును ఏవిధముగా మనము ఉపయోగించవచ్చును: ఇద్దరు సహోదరులు ఒక సంఘములో కలసిపని చేయుచున్నారని అనుకొందము మరియు వారిద్దరికి వివాదము కలిగినది. అందులో ఒకరు సంఘమును విభజించి(చీల్చి) ఒక గుంపుతో బయటకు వెళ్ళెను. అతడు నిజమైన తల్లిగా ఉన్నాడా? నిశ్చయముగా లేడు. నిజమైన తల్లి సంఘమును విభజించదు, సంఘమంతటినీ నీవే కలిగియుండవచ్చునని” చెప్పును.

విశ్వాసుల సంఘమును ఎప్పుడైనను విభజించవద్దు. సంఘమును విభజించకుండా, నీవే సంఘమునుండి బయటకు వెళ్ళి మరియు పూర్తిగా నూతనముగా పని ప్రారంభించుము. దేవుడు నిన్ను దీవించును. ఆ సంఘమునకు నీవు నిజమైన తల్లివైనయెడల, దేవుడు ఆసంఘనాయకత్వమును నీకివ్వగోరినయెడల, వేరొక స్త్రీని చంపియైన సరే ఆబిడ్డను నీకిచ్చును. ఆయన సౌలును చంపి మరియు రాజ్యమును దావీదునకిచ్చెను. ఈనాడు కూడా ఆయన ఆవిధముగా చేయగలడు. కాని సజీవమైన బిడ్డను రెండు ముక్కలుగా చేయవద్దు. సంఘమును చీల్చవద్దు. వెళ్ళి వేరొకచోట పనిచేయుము. దేవుడే స్వయముగా తనచేతినుండి నీకు సమస్తమును ఇవ్వనిమ్ము. దేనిని లాక్కొనవద్దు మరియు విభజించవద్దు.

సంఘనాయకత్వముతో నేను ఏకీభవించలేనప్పుడు, ఇదే నియమమును నేను వెంబడించితిని. కొందరు నన్ను వెంబడించునట్లు, సంఘమును చీల్చుటకు ప్రయత్నించలేదు. నేను వేరొక చోటికి వెళ్ళి మరియు “ప్రభువా! మొదటినుండి మరల నన్ను ఆరంభించనివ్వుము. నాకు వేరొక బిడ్డను ఇమ్ము. దానికొరకు నేను పోరాడను”. ఆవైఖరిని బట్టి దేవుడు నాపనిని ఎంతో సమృద్ధిగా ఆశీర్వదించెను. గనుక మీకుకూడా దానినే చెప్పుచున్నాను.

1 రాజులు 4:29 లో “దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింపశక్యముకాని వివేచనగల మనస్సును సొలొమోనుకు దయచేసెను”. సొలొమోను చాలా యౌవ్వనస్థుడని గుర్తుపెట్టుకొనుము. ఈ నాలుగు వరములు ఇవ్వమని యౌవ్వనస్థులు దేవుని అడుగవచ్చును. జ్ఞానము, బుద్ధిని, వివేచనగల మనస్సును మాత్రమేగాక “సముద్ర తీరమున ఇసుక రేణువులవలె విశాలహృదయమును ఇచ్చెను” అనగా ఇసుక రేణువులవలె విస్తారముగా ఉన్న దేవుని ప్రజలను అంగీకరించే హృదయమును దేవుడు మనకిచ్చును (ఆది 22:17).

నీ బాప్తీస్మము లేక అన్యభాషలతో మాట్లాడటముగూర్చి నీతో ఏకీభవించని వేరొక తెగకు చెందిన సహోదరుని గూర్చి ఆలోచించెదము. దేవుడు అతనిని అంగీకరించెను. మనము ఈలాగు ప్రార్ధించవలెను, “ప్రభువా: ఆసహోదరుడు నాతో కలసి పరిచర్య చేయకపోయినప్పటికీ లేక నాతో ఏకీభవించనప్పటికీ అతనిని సంతోషముతో అంగీకరించుటకు నా హృదయమును విశాలపరచుము”. దేవుని పిల్లలు ఎందరున్నారో వారందరినీ నా సహోదరులు మరియు సహోదరీలుగా కావలెనని కోరుచున్నాను.

ఒక దేవుని బిడ్డకు ఒక విషయములో మనకంటే వేరే విధముగా ఒప్పుదల ఉన్నదనుకొందాము. ఆవ్యక్తిని మనము అంగీకరించగలమా? బంగారపు నగలు ధరించిన ఒక సహోదరి బాప్తీస్మము తీసుకొనుటకు నా దగ్గరకు వచ్చెను. విశ్వాసులు బంగారు నగలు ధరించకూడదనే ఒప్పుదల నేను కలిగియున్నాను. 1 తిమోతి 2:9 మరియు 1 పేతురు 3:3 వచనముల ప్రకారము నేను దానిని అర్ధము చేసుకొనియున్నాను. ఇప్పుడు ఆ సహోదరికి నేను బాప్తీస్మము ఇవ్వవలెనా లేక ఇవ్వకూడదా? . ఆసమయములో ప్రభువు నన్ను ఒక ప్రశ్న అడిగెను: “నేను ఆమెను అంగీకరించియున్నానని నీవు చెప్పుదువా?” నేను ఈలాగు చెప్పితిని, “ప్రభువా! నేను చూడగలిగినంతవరకు ఆమె తిరిగి జన్మించినది గనుక నీవు ఆమెను అంగీకరించితివి”. అప్పుడు ప్రభువు, “నేను అంగీకరించిన వ్యక్తిని నీవెలా నిరాకరించగలవు?” అని అడిగెను. గనుక ఆమెకు నగలతోనే బాప్తిస్మము ఇచ్చితిని. నేను ఒప్పుకొను(నమ్మే) వాటికి, వారి ఒప్పుదలలు వేరుగా ఉన్నప్పటికీ దేవుడు అంగీకరించిన వారందరిని నేను కూడా అంగీకరించెదను.

ఒక విషయములో ప్రభువు నన్ను ఈలాగు అడుగుట గుర్తున్నది, “ఈ విషయమును గ్రహించుటకు నీకెంత సమయము పట్టినది” కొన్ని సం||లు పట్టినదని నేను ఒప్పుకొన్నాను. గనుక ఆవ్యక్తి గ్రహించుటకు సమయమును తీసుకొనిన యెడల, అతని విషయములో నేనెందుకు సహనము చూపకూడదు? అని అడిగెను.

మనందరికి విశాల హృదయము అవసరమైయున్నది. మనము యౌవ్వనస్థులుగా ఉన్నప్పుడు మనమెంతో ఆసక్తికలిగి, సంకుచితమైన మనస్సు, మరియు హృదయము కలిగి ప్రతి విషయములో మనతో ఏకీభవించే వారినే అంగీకరించెదము. నేను యౌవ్వనస్థుడిగా ఉన్నప్పుడు ఆలాగు ఉన్నానని చెప్పుటకు సిగ్గుపడుచున్నాను. అనేక బుద్ధిహీనమైన వైఖరులలో ఇది ఒకటి. కాని నేను పెద్దవాడినై ప్రభువును ఎక్కువగా ఎరుగుటవలన నా హృదయము విశాలపరచబడవలసియున్నది.

అనువాదము : టి.ఎల్.మర్రెడ్డి     ఈ పేజిని ముద్రించుకోండి    ఈ పేజీని పంపండి

"వారపు సందేశం" - మీకు ఏవైనా అభిప్రాయములు లేదా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మాకు పంపగలరు :telugu@cfcindia.com, cfc@cfcindia.com
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి | వారపు సందేశం | దైవ సందేశములు | ఆడియో| వీడియో | సంప్రదించండి

© Copyright - Christian Fellowship Church , Bangalore. (INDIA)