English shape=
      

వారపు సందేశం - Word For The Week

"వారపు సందేశం" అనునది ప్రతివారము ప్రచురింపబడే వార్తా సందేశము. ఇందులో ప్రతి అంశము జాక్ పూనన్ గారి యొక్క ఉపదేశములు, పుస్తకాలు లేదా ప్రసంగముల నుండి స్వీకరించబడును.
2011 |  2012 |  2013
పూర్తిగా ప్రభువునకు సమర్పించుకొనుట
ఆగష్టు 2011 (2) - జాక్ పూనన్

యెహెజ్కేలు 4వ అధ్యాయములో ప్రభువు అనేక గుర్తు(చిహ్నము)ల ద్వారా యెహెజ్కేలుతో మాట్లాడెను. ఆయన అతనిని మొదటగా పెంకు చెయ్యమని చెప్పి మరియు 390 దినములు ఒక ప్రక్కన పండుకొని మరియు 40 దినములు మరియొక ప్రక్కన పండుకొనమని చెప్పెను. దేవుడు యెరూషలేమును మరియు ఇశ్రాయేలు, యూదా వారిని యెట్లు శిక్షించుచున్నాడో బాబెలోనులో ఉన్న యూదా వారికి చూపించుటకు యెహెజ్కేలును ఒక మాదిరిగా ఉంచెను. అతడు అతని యొక్క వర్తమానమునకు సజీవ సాక్ష్యముగా ఉండెను.

ప్రభువు అతనిని కొన్ని విచిత్రమైన పనులు అనగా ఆహారమును మలముతో కాల్చి మరియు తలను గడ్డమును క్షౌరము చేసుకొని, ఇశ్రాయేలీయులలో మిక్కిలి కొద్దిమంది మాత్రమే రక్షింపబడెదరని చూపించుటకు ఆ వెంట్రుకలలో కొంచెము మాత్రమే తనయొద్ద ఉంచుకొనమనెను (యెహెజ్కెలు 5:1-4). నీవు ప్రవక్తవైనయెడల, అందముగా కనబడుటను గూర్చి మరచిపోవలసియుండును!! దేవుడు నీ తలను క్షౌరము చేసికొనమని చెప్పినట్లయితే నీవు తలను క్షౌరము చేసికొనవలెను. కాని "ప్రభువా అది నేను మంచిగా కనబడకుండా చేయును" అని చెప్పలేవు. అతడు సామాన్యమైన ఆహారమును మలము కాల్చి చేసుకొనవలెను. యెహెజ్కేలు ఒకవేళ యాజకుడైయున్నయెడల అది అతనికి చాలా సులభముగా ఉండెడిది. కాని ఒక ప్రవక్తగా అతడు తినే అలవాట్ల విషయములోను మరియు కనబడే విషయములోను క్రమశిక్షణలో ఉండవలసియుండెను. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారోనని చింతించలేదు. అతడు దేవునిని మాత్రమే సంతోషపెట్టవలసియుండెను.

కనుక నీవు దేవుని సేవకునిగా ఉండవలెనని కోరినట్లయితే, నీ ఆకారమును గూర్చిగాని లేక నీ ఆహారమును గూర్చిగాని ఎన్నటికీ దేవునికి ఫిర్యాదు చెయ్యవద్దు. దేవుడు నీకిచ్చినదానంతటినీ అంగీకరించి మరియు ఆయన నీకు చెయ్యమని చెప్పిన ప్రతిదానికి లోబడుము. నీ జీవితములోని ప్రతిచిన్న విషయమును దేవుడు నిర్ణయించెను. నేను 22 సం||ల యౌవ్వనస్థుడుగా ఉన్నప్పుడు, దేవుని వాక్యము ప్రకటింప మొదలుపెట్టియున్నాను. మరియు ఆ వయస్సులో నాతల వెంట్రుకలు కోల్పోవుట మొదలైనది. అయిననూ నా తల వెంట్రుకలు కోల్పోవుట ఆగిపోవలెనని నేనెప్పుడైననూ ప్రార్ధన చెయ్యలేదు. దేవుడు దానిని అనుమతించుటకు కారణము ఉండి ఉండవచ్చునని తలంచితిని. మరియు ఆ కారణమును నేను కనుగొంటిని. ఆ వయస్సులో కూడా నాకు జరిగినదంతయు ప్రభువు కొరకు నేనుచేయు పరిచర్యకు సంబంధించినదై యున్నదని కనుగొంటిని. అయినను ప్రజల యెదుట నేను మాట్లాడుటకు నిలువబడినప్పుడు, నేను చాలా వెంట్రుకలు కోల్పోయినందున నా వయస్సు 22 సం||లే అయినప్పటికీ ప్రజలు 30 లేక 35 సం||లని అనుకొనెడివారు. గనుక వారు నామాటలు వినుటకు ఎక్కువ శ్రద్ద చూపెడివారు. ఒకవేళ వారికి నాకు 22 సం||లే అని తెలిసినయెడల, యౌవ్వనస్థుడనని నన్ను తృణీకరించెడివారేమో! ఇంత చిన్న విషయములో కూడా దేవునికి ఒక ఉద్ధేశ్యము ఉన్నదని చూడగలిగియున్నాను.

నీవు యౌవ్వనదశలోనే దేవునికి పూర్తిగా సమర్పించుకొని మరియు “ప్రభువా, నాకు ఆహారము విషయములోగాని, ఆకారము విషయములోగాని మరి ఏ ఇతర విషయమందును ఆసక్తిలేదు. నేను పరిశుద్దాత్మతో నింపబడి మరియు అభిషేకించబడి నిన్ను సేవించవలెను. మరియు ఆ అభిషేకము విషయములో నాజీవితకాలమంతయు యదార్ధముగా ఉండవలెనని కోరుచున్నాను. వేరే బోధకుల మాదిరిని వెంబడించవలెనని నేను కోరుటలేదు. యేసు వైపు చూడవలెనని నేను కోరుచున్నాను. మరియు ఇటువంటి ప్రవక్తలయొక్క మాదిరిని చూడవలెనని కోరుచున్నాను. నేను నిన్ను హృదయపూర్వకముగా వెంబడించవలెనని కోరుచున్నాను” అని చెప్పవలెను. అప్పుడు నీవు ఎంతో పురికొలపబడిన జీవితమును కలిగియుండెదవని నిశ్చయముగా చెప్పగలను. దేవుడే స్వయముగా ఆయన వాక్యమును నేర్పించి మరియు నీ హృదయముతో మాట్లాడును. వేరే ప్రజలతో మాట్లాడుటకు నీకు మాటలిచ్చును. కాని నీవు ఆయనకు పూర్తిగా సమర్పించుకొనవలెను. భూమిమీద ఘనత కొరకుగాని, లేక అంగీకారముకొరకుగాని, డబ్బుకొరకుగాని, మరిదేనికొరకును నీకు ఆశగాని లేక కోరికగాని ఉండకూడదు. నీ దేహము, నీ సమయము, నీ ధనము, నీ కుటుంబము సమస్తమును దేవునివై యుండవలెను. నీవు ఆవిధముగా ఉండుటకు ఇష్టపడినయెడల, దేవుడు నీ ద్వారా చెయ్యగలిగినదానికి హద్దులుండవు.

అనువాదము : టి.ఎల్.మర్రెడ్డి     ఈ పేజిని ముద్రించుకోండి    ఈ పేజీని పంపండి

"వారపు సందేశం" - మీకు ఏవైనా అభిప్రాయములు లేదా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మాకు పంపగలరు :telugu@cfcindia.com, cfc@cfcindia.com
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి | వారపు సందేశం | దైవ సందేశములు | ఆడియో| వీడియో | సంప్రదించండి

© Copyright - Christian Fellowship Church , Bangalore. (INDIA)